Singareni: బొగ్గు గని ప్రమాదంలో గల్లంతైన నవీన్ కుమార్ మృతదేహం లభ్యం
- నిన్న పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో కూలిన పైకప్పు
- 12 గంటల గాలింపు తర్వాత విగతజీవిగా కనిపించిన నవీన్
- కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన ఓవర్‌మన్ రాపోలు నవీన్ కుమార్ (28) మృత్యువాత పడ్డాడు. నిన్న ఆయన పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో 1.8 మీటర్ల మందం ఉన్న పైకప్పు కూలి పడడంతో నవీన్ కుమార్ చిక్కుకుపోయాడు. ప్రమాదం నుంచి మరో ఐదుగురు తప్పించుకోగా, ఎస్‌డీఎల్ తాత్కాలిక ఆపరేటర్ కలవేణి సతీశ్ (31) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
బొగ్గు పొరల కింద చిక్కుకుపోయిన నవీన్ కుమార్ కోసం రెస్క్యూటీం 12 గంటలుగా గాలిస్తుండగా, చివరికి ఈ ఉదయం విగతజీవిగా కనిపించాడు. గని నుంచి అతడి మృతదేహాన్ని వెలికి తీసుకొచ్చిన అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.