Rajinikanth: రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందే.. సూపర్ స్టార్ ఇంటి వద్ద అభిమానుల బైఠాయింపు!

Fans reached Rajinikanth Home and chanted to come politics

  • రజనీకాంత్ రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు వార్త
  • ఇంటి వద్దకు చేరుకుని అభిమానుల నినాదాలు
  • రజనీ రాజకీయ అరంగేట్రంపై అయోమయం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగుతుండగా, అభిమానులు మాత్రం ఆయన ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాలకు స్వస్తి పలకబోతున్నట్టు త్వరలో ప్రకటించబోతున్నారన్న వార్త ఇప్పుడు ఆయన అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది.

 రాజకీయాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు రజనీ త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారం బయటకు పొక్కింది. దీంతో తట్టుకోలేని అభిమానులు నిన్న చెన్నై పొయెస్ గార్డెన్‌లోని ఆయన ఇంటి వద్దకు చేరుకుని బైఠాయించారు. రాజకీయాల్లోకి రావాల్సిందేనని నినాదాలు చేశారు.  

రజనీకాంత్ ఇటీవల తన అభిమాన సంఘాలను ‘మక్కల్ మన్రం’గా మార్చడంతోపాటు వాటి బలోపేతానికి చర్యలు చేపట్టారు. సభ్యత్వ నమోదు కూడా చేపట్టారు. అంతేకాదు, తాను అధికారంలోకి వస్తే ఆధ్యాత్మిక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు కూడా. అయితే, కరోనా కారణంగా ఆయన గత ఏడు నెలలుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు.

మరోపక్క, రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. రజనీ తన రాజకీయ నిర్ణయాన్ని త్వరలో అభిమానుల సమక్షంలో ప్రకటిస్తారని  చెన్నై కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ కరాటే త్యాగరాజన్‌ చెప్పారు. అయితే, అంతలోనే రాజకీయాల నుంచి రజనీ తప్పుకోబోతున్నారంటూ మరో వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

ఇంకోవైపు, అభిమానుల అసంతృప్తితో దిగొచ్చిన రజనీ తన మనసు మార్చుకున్నారని, వచ్చే నెలలో మక్కల్ మన్రం నిర్వాహకులతో సమావేశం అవుతారని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. ఇలా స్పష్టత లేని ప్రకటనలు వెలువడుతుండడంతో అభిమానులే కాదు, తమిళ రాజకీయ నాయకులు కూడా అయోమయంలో పడిపోయారు. ఇదిలావుంచితే, మక్కల్‌ మన్రం చెన్నై ఎగ్మూరు శాఖ ఉప కార్యదర్శి కె. రజని మాట్లాడుతూ నిరాహార దీక్షలు చేపట్టైనా రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News