YSRCP: జగన్ గారూ, నన్ను రక్షించండి.. ఎంపీ నందిగం అనుచరులు చంపేసేలా ఉన్నారు: వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో

YCP worker selfie video to jagan ask for protection from MP Nandigam supporters

  • నందిగం అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపణ
  • ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఎంపీని కలవమని సీఐ సలహా
  • ఖండించిన సీఐ శ్రీహరి రావు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని లింగాయపాలెం రైతు పొన్నూరు శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తాను వైసీపీ కార్యకర్తనని, గత ఎన్నికల్లో వైసీపీకే ఓటేశానని చెప్పుకొచ్చాడు. ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనను కాపాడాలని అందులో వేడుకున్నాడు.

లింగాయపాలెంలో ఎంపీ అనుచరులు ఇసుక తవ్వకాలు చేపట్టారని, ఆ పక్కనే తనకు రెండెకరాల పొలం ఉందని పేర్కొన్నాడు. పొలానికి తాను అటునుంచే వెళ్లడంతో ఇసుక తవ్వకాల సమాచారం తానే ఇచ్చాననే ఉద్దేశంతో తనపై దాడి చేశారని, ఫోన్, రూ. 10 వేలు లాక్కున్నారని ఆరోపించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడి సీఐ కేసు నమోదు చేయకుండా ఎంపీని కలవాలని చెప్పారని, దీంతో ఎస్పీ వద్దకు వెళ్తానంటే కేసు నమోదు చేశారని గుర్తు చేశారు. అయితే, నిందితులను మాత్రం ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని అన్నారు.

శ్రీనివాసరావు ఆరోపణలపై స్పందించిన సీఐ శ్రీహరిరావు మాట్లాడుతూ.. శ్రీనివాసరావును తానెప్పుడూ చూడలేదని, ఎంపీ వద్దకు వెళ్లమని చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ కేసులో నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు. కాగా, శ్రీనివాసరావుపై నందిగం సురేశ్ అనుచరులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా, తాజాగా వెలుగులోకి వచ్చి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

  • Loading...

More Telugu News