Chandrababu: సర్దార్ వల్లభాయ్ పటేల్ కు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఘన నివాళులు
- నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి
- అసమాన ధైర్యశాలి అంటూ చంద్రబాబు ట్వీట్
- కారణజన్ముడు అని పేర్కొన్న పవన్ కల్యాణ్
నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరంలోనూ, స్వాతంత్ర్యం అనంతరం కూడా తన అసమాన ధైర్యసాహసాలతో భారత జాతికి ఎంతో మేలు చేసిన భరతమాత ప్రియపుత్రుడు అని కొనియాడారు. దేశానికి తొలి హోంమంత్రిగా వందలాది సంస్థానాలను విలీనాల బాట పట్టించడంలో పటేల్ ప్రదర్శించిన సాహసం చరిత్రలో నిలిచిపోయింది అని కీర్తించారు. ఆ మహాశయుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
ఇక, పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రకటన చేశారు. ఉక్కు సంకల్పం కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. భారతదేశం దృఢమైన మహాదేశంగా భాసిల్లుతోందంటే అందుకు మనం ముందుగా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు.
"దేశ సమగ్రతకు ప్రతీకగా నిలిచే ఆ మహానుభావుని 145వ జయంతి సందర్భంగా నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఘనంగా అంజలి ఘటిస్తున్నాను. నింగిని తాకే ఈ భారతరత్న కీర్తి అజరామరంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి ముక్కచెక్కలుగా ఉన్న భారత్ ను తన దృఢచిత్తంతో సమైక్యదేశంగా రూపుదిద్దిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. న్యాయకోవిదుడైన పటేల్ భారత రాజ్యాంగ రూపకల్పనలో అందించిన సేవలు అమూల్యమైనవి. ఒక స్థిరమైన లక్ష్యాన్ని నెరవేర్చేవారిని కారణజన్ములని కీర్తిస్తారు. అలాంటి కారణజన్ముడే వల్లభాయ్ పటేల్" అని వివరించారు.