Pawan Kalyan: క్రికెట్ అనే పుస్తకానికి ముఖచిత్రం మన తెలుగు బిడ్డడే: పవన్ కల్యాణ్
- నేడు సీకే నాయుడు 125వ జయంతి
- ఘన నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
- సీకే నాయుడు తెలుగువాడు కావడం మన అదృష్టమన్న పవన్
భారత క్రికెట్ అభివృద్ధికి బీజం వేసిన కల్నల్ కొఠారి కనకయ్య నాయుడు (సీకే నాయుడు) 125వ జయంతి సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. ఓ ప్రత్యేక ప్రకటన చేసిన పవన్... సీకే నాయుడు ఘనతలను వివరించారు. క్రికెట్ అంటే ఇష్టపడని భారతీయులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు.
ఇవాళ అధిక సంఖ్యలో భారతీయ యువతీయువకులు క్రికెట్ అంటే మైమరిచిపోతారని, మన జీవితాలపై అంతటి ప్రభావం చూపుతున్న క్రికెట్ అనే పుస్తకానికి ముఖచిత్రం మన తెలుగు బిడ్డడే అని తెలిపారు. ఆయనే సీకే నాయుడుగా ప్రసిద్ధి చెందిన కొఠారి కనకయ్య నాయుడు అని వివరించారు. ఆయన తాత ముత్తాతలు కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లారని వెల్లడించారు. సీకే నాయుడు భారత టెస్ట్ క్రికెట్ కు తొలి కెప్టెన్ కావడం తెలుగువాళ్లందరికీ గర్వకారణం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఆల్ రౌండర్ అయిన నాయుడు సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్ అని కొనియాడారు. ఐదు దశాబ్దాల పాటు క్రికెట్ లో రాణించడం ఆయనకు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదని, 62 ఏళ్ల వయసులో దేశవాళీ మ్యాచ్ లో అర్ధసెంచరీ సాధించడం ఊహకందని విషయం అని కీర్తించారు. ఆయన ఫిట్ నెస్ అలాంటిది అని తెలిపారు.
సీకే నాయుడు పుట్టింది మహారాష్ట్ర గడ్డపైనే అయినా, చివరి వరకు తెలుగు సంప్రదాయాలు, పద్ధతులు పాటించారని, అటువంటి గొప్ప క్రీడాకారుడు మన తెలుగువాడు కావడం మన అందరి అదృష్టం అని పేర్కొన్నారు. తెలుగు ఖ్యాతిని క్రీడా ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేసిన సీకే నాయుడుకు ఆయన జయంతి సందర్భంగా తన తరఫున, జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నానని పవన్ తన ప్రకటనలో వివరించారు.