Jyotiradiya: అవును నేను కుక్కనే... ఇప్పుడేంటి?: జ్యోతిరాదిత్య సింధియా!
- కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు
- ప్రజలకు మాత్రమే విశ్వాసపాత్రుడిని
- ధీటైన సమాధానం ఇచ్చిన సింధియా
మధ్యప్రదేశ్ లో ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, నేతల మధ్య వాగ్బాణాల యుద్ధం తీవ్రమైంది. ఇటీవల ఓ మహిళా రాజకీయ నాయకురాలిని 'ఐటమ్'గా అభివర్ణించి, విమర్శలు కొని తెచ్చుకున్న కమల్ నాథ్, తాజాగా, బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాను కుక్కగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. దీనిపై సింధియా కూడా అదే రీతిలో స్పందించారు.
"కమల్ నాథ్ గారు అశోక్ నగర్ వచ్చి నన్ను కుక్కంటూ సంబోధించారు, అవును కమల్ నాథ్ గారూ నేను కుక్కనే. ఎందుకంటే, నేను ప్రజలకు విధేయుడిని, వారే నా యజమానులు. ఓ కుక్క తన యజమానులను రక్షిస్తుంది. నేను కూడా ప్రజలకు విశ్వాసంగా ఉండి వారిని రక్షిస్తుంటాను" అని వ్యాఖ్యానించారు.
కమల్ నాథ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగానే పరిగణించింది. కమల్ నాథ్ ప్రతినిధి నరేంద్ర సలూజా స్పందిస్తూ, సింధియాపైగానీ, మరే ఇతర నేతలపైగానీ కమల్ నాథ్, ఆ మాటను వాడలేదని అనడం గమనార్హం. అయితే, కమల్ నాథ్, సింధియా వాదోపవాదాల మధ్య మరో నేత వ్యాఖ్యల వీడియో కూడా వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణన్, ఓ ర్యాలీలో మాట్లాడుతూ, "ఈ ప్రాంతంలోని ఓ మాఫియా డాన్ కు వ్యతిరేకంగా కమల్ నాథ్ పోరాడుతూ ఉంటే, ఇదే ప్రాంతంలోని ఒకరు, నమ్మకమైన కుక్కలా ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు" అని అనడం గమనార్హం. అయితే, తన వ్యాఖ్యల్లో ప్రమోద్ ఎక్కడా సింధియాను ప్రస్తావించిక పోవడం గమనార్హం.