Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నేతల శుభాకాంక్షలు!
- ఏపీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
- రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి: వెంకయ్య
- కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు: మోదీ
- భారత్ అభివృద్ధికి ఏపీ చేసిన అపార కృషి ప్రశంసనీయం: షా
ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్లు చేస్తూ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు అన్నారు. భాషా సంస్కృతులను పరిరక్షించుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ కూడా తెలుగులో ట్వీట్ చేశారు. ‘కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. భారత్ అభివృద్ధికి ఏపీ చేసిన అపార కృషి ప్రశంసనీయమని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీ శ్రేయస్సు కోసం కేంద్రం అంకితభావంతో పని చేస్తోందని చెప్పారు.
జాతి నిర్మాణంలో ఏపీ తన వంతు పాత్రపోషిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఏపీ ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లోనూ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని అన్నారు. వీరితో పాటు పలు పార్టీల నేతలు ఏపీ రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు.