Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దు: బండి సంజయ్
- హైదరాబాదులో శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మాహుతి యత్నం
- ఉస్మానియాలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్
- పరామర్శించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మాహుతికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. కాగా, ఆత్మహత్యకు ప్రయత్నించిన శ్రీనివాస్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ మధ్యాహ్నం పరామర్శించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దని స్పష్టం చేశారు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని అన్నారు. శ్రీనివాస్ కు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అటు, దుబ్బాక ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు కలలో కూడా దుబ్బాకే గుర్తుకొస్తుందని అన్నారు. దుబ్బాక చౌరస్తాలో కేసీఆర్ తో తాను చర్చకు రెడీ అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అబద్ధాల్లో కేసీఆర్ కు ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
రేపు పేపర్ లో వార్త రావాలనే తనకు హరీశ్ రావు లేఖ రాశారని ఆరోపించారు. బండి సంజయ్ కు మంత్రి హరీశ్ రావు 18 ప్రశ్నలతో లేఖ రాయడం తెలిసిందే.