Kannada: కర్ణాటక ఉద్యోగ నియామకాల్లో కన్నడ భాషా నైపుణ్య పరీక్ష!
- జాతీయ అర్హత పరీక్ష తరహాలో లాంగ్వేజి స్కిల్ టెస్ట్
- స్థానికులకు లబ్ది చేకూర్చేలా తాజా ప్రతిపాదనలు
- పరిశీలిస్తున్న కర్ణాటక ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కన్నడిగులకే అత్యధిక లబ్ది చేకూరేలా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా భాషా నైపుణ్య పరీక్ష నిర్వహణపై ఆసక్తి చూపుతోంది. ఉద్యోగ నియామకాల్లోనూ, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇకపై కన్నడ భాషా నైపుణ్య పరీక్ష నిర్వహించాలని తలపోస్తోంది. తద్వారా స్థానిక కన్నడ ప్రజలకు న్యాయం జరుగుతుందని యెడియూరప్ప సర్కారు భావిస్తోంది.
కేంద్రం గ్రూప్-సి, గ్రూప్-డి ఉద్యోగాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు తరహాలోనే 'కన్నడ భాషా కౌశల్య పరీక్షె' పేరిట ఓ స్కిల్ టెస్టు నిర్వహించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇది స్థానికుల ప్రయోజనాలను పరిరక్షించడమే కాకుండా, ఉద్యోగులకు, స్థానికులకు మధ్య సరైన భావవ్యక్తీకరణకు ఉపయోగపడుతుందని కన్నడ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ టీఎస్ నాగాభరణ తెలిపారు. రాజ్యోత్సవ సభలో దీనిపై ప్రకటన చేయాలంటూ సీఎం యెడియూరప్పను కోరామని పేర్కొన్నారు.
దీనిపై మంత్రి సీటీ రవి స్పందిస్తూ, ఈ అంశాన్ని కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని, ఓ చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.