APSRTC: ప్రతిష్టంభనకు తెర.. ఏపీ-తెలంగాణ మధ్య తిరగనున్న బస్సులు
- ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం
- నేడు హైదరాబాద్లో ఒప్పందం
- త్వరలోనే బస్సులు రోడ్డెక్కుతాయన్న మంత్రి పువ్వాడ
ఆర్టీసీ బస్సు సర్వీసుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య అవగాహన కుదరడంతో త్వరలోనే రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో నేడు సమావేశం కానున్న రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణకు 1,009 సర్వీసులతో 2,65,367 కిలోమీటర్ల మేర ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. తాజా అవగాహన ప్రకారం ఇక నుంచి ఇది 1,60,919 కిలోమీటర్లకు పరిమితం కానుంది. అలాగే, ఏపీ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో బస్సు సర్వీసుల విషయంలో నెలకొన్న సమస్య కూడా కొలిక్కి వచ్చింది. ఈ రూట్లో ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పటి వరకు 374 బస్సులు నడుపుతుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 192కు పరిమితం కానుంది. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు 162 సేవలు అందించనున్నాయి. తాజా అవగాహనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తెరపడినట్టు చెప్పారు. ఒప్పందం పూర్తయిన వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు.