Amarender Singh: మన జవాన్లకు నిత్యావసరాల కొరత ఏర్పడచ్చు.. రవాణా రైళ్లను పునరుద్ధరించండి: పంజాబ్ సీఎం అమరీందర్

Amarender Says Armed Forces in Border Diprived of Food Supplies

  • పంజాబ్ మీదుగా ప్రయాణించే గూడ్స్ రైళ్లకు బ్రేక్
  • దాదాపు నెల నుంచి ఆగిన సరకు రవాణా రైళ్లు
  • రైతుల రైల్ రోకో కారణంగా నిలుపుదల  

చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా లడఖ్, కశ్మీర్ ప్రాంతాల్లోని భారత జవాన్లకు నిత్యావసరాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, వెంటనే తమ రాష్ట్రంలో సరకు రవాణా రైళ్లను పునరుద్ధరించి, వారి అవసరాలను తీర్చాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన ఓ లేఖను రాశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, పంజాబ్ లో నిరసనలు మిన్నంటిన వేళ, రాష్ట్రం నుంచి వెళ్లే అన్ని గూడ్స్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఆ విషయాన్నే ప్రస్తావించిన అమరీందర్ సింగ్, శీతాకాలం వస్తోందని, గూడ్స్ రైళ్లు తిప్పాలన్నా కష్టతరం అవుతుందని గుర్తు చేస్తూ, మంచు కప్పేయకముందే సైనికుల అవసరాలను తీర్చేందుకు, మారుమూల ప్రాంతాలకు సరకులను పంపేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. తన ప్రభుత్వం నక్సల్స్ దళాలతో చేతులు కలిపిందని బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని, రైతులు తమ నిరసనలు తెలిపితే, సైన్యం మీద కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని అన్నారు.

సైనికుల మీద ఒత్తిడి పెరుగుతోందని, వారు దేశ రక్షణ కోసం కృషి చేస్తుంటే, కనీస అవసరాలను తీర్చాలన్న విషయాన్ని బీజేపీ మరచిపోయిందని, బీజేపీ తక్షణం స్పందించకుంటే, పరిస్థితులు తీవ్రంగా మారుతాయని అమరీందర్ సింగ్ తన లేఖలో హెచ్చరించారు. గూడ్స్ రైళ్లు నడవక పోవడంతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం కూడా నష్టపోతున్నాయని వెల్లడించిన ఆయన, వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.

ఇక ఇదే లేఖలో ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వని శర్మ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. రైతులను నక్సలైట్లుగా అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. భారత రైతులు అన్నదాతలని అభివర్ణించిన ఆయన, వారిని అసాంఘిక శక్తులతో పోలుస్తూ, దేశ పౌరులను బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. కాగా, సెప్టెంబర్ లో రైతుల ఆధ్వర్యంలో రైల్ రోకో ప్రారంభమైన తరువాత, పంజాబ్ మీదుగా ఒక్క సరకు రవాణా రైలు కూడా తిరగలేదు.

  • Loading...

More Telugu News