Vijayashanti: హరీశ్ రావుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న కేసీఆర్: విజయశాంతి

Vijayashanti Comments on Dubbaka Bipolls

  • ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం
  • ఎన్నికల తరువాత హరీశ్ కు రిటర్న్ గిఫ్ట్
  • కేటీఆర్ ను సీఎంను చేసే ఆలోచన
  • కేసీఆర్ స్టయిలే వేరన్న విజయశాంతి

కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నటి విజయశాంతి, ట్విట్టర్ వేదికగా, టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. దుబ్బాక బై పోల్స్ లో విపక్షాలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలన్న ఉద్దేశంతో వారికి నిద్ర పట్టడం లేదని సెటైర్లు వేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ఎంతో శ్రమిస్తున్న హరీశ్ రావుకు, ఆయన మామ కేసీఆర్, ఎన్నికల తరువాత రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారని, అది కేటీఆర్ ను సీఎంను చేయడమేనని అంటూ, వరుసగా ట్వీట్లు చేశారు.

"మొత్తం మీద కేసీఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ గారు అనుసరించే స్టైలే వేరు" అని విజయశాంతి అన్నారు.

ఆపై, "ఓవైపు హరీష్ రావు గారు దుబ్బాకలో బీజేపీ నేతల మీద విరుచుకు పడుతుంటే.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ గారు బీజేపీ నేతలకు సవాల్ విసరడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన బీజేపీ నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావు గారికి కూడా సంకేతం ఇచ్చినట్టేనని తెలంగాణ సమాజం భావిస్తోంది" అన్నారు.

"తనపైన, సర్కారుపైనా నిరాధార ఆరోపణలు చేస్తే, విపక్ష నేతల్ని జైలుకు పంపిస్తానని కేసీఆర్ గారు బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి. తన సర్కారుపై ఆరోపణలు చేస్తే విపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్ గారు, నేడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారనే ప్రశ్న వస్తోంది" అని వ్యాఖ్యానించారు.

ఆపై కూడా మరికొన్ని ట్వీట్లు చేస్తూ, "నాడు దీనిపై స్పందించిన కేసీఆర్ గారు, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు" అన్నారు.

"బీజేపీ మీద నెపం పెట్టి... సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ గారు సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని విశ్లేషకుల మాట. కేంద్ర హోంమంత్రి, బీజేపీ  మాజీ అధ్యక్షుడు అమిత్ షా గారు గతంలో తెలంగాణ వచ్చినప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేస్తోందన్నారు" అని విజయశాంతి ట్వీట్లు చేశారు.

"దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు రాగానే, తన తనయుడు కేటీఆర్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ గారు రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాల ప్రచారం. ఈ వాదనకు బలం చేకూర్చేలా... మొదటిసారి కేసీఆర్ గారి నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకొచ్చింది" అని,"దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది" అని కూడా సెటైర్లు వేశారు.

  • Loading...

More Telugu News