Corona Virus: మరో ఉద్దీపన ప్యాకేజీకి ప్లాన్ చేస్తున్న కేంద్రం!

Another Stimulus Package by Center in Near Term

  • పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం
  • నష్టపోయిన రంగాలకు ప్రోత్సాహకాలు
  • మార్చి నాటికి పాజిటివ్ వృద్ధి రేటుకు అవకాశం
  • ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే

కరోనా, లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పడేసేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీకి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే మరో ఉద్దీపన ప్యాకేజీ రానుందని అన్నారు. ఆర్థిక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, తాజా ప్యాకేజీలో అత్యధికంగా నష్టపోయిన రంగాలకు ప్రోత్సాహకాలు ఉంటాయని అన్నారు.

ఈ మేరకు వివిధ పారిశ్రామిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, వారి కోరికలు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అజయ్ భూషణ్ పాండే తెలియజేశారు. లాక్ డౌన్ సడలింపుల తరువాత ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సంవత్సరం అక్టోబర్ లో జీఎస్టీ వసూలు రూ. 1,05,155 కోట్లకు పెరిగిందని, గత సంవత్సరంతో పోలిస్తే, 10 శాతం అధికమని గుర్తు చేసిన ఆయన, ఎకానమీ తిరిగి పూర్వపు స్థితికి వస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. సెప్టెంబర్ లో సైతం జీఎస్టీ వసూళ్లు నాలుగు శాతం పెరిగాయని తెలిపిన ఆయన, దేశంలో విద్యుత్ వినియోగంతో పాటు ఎగుమతులు, దిగుమతుల విషయంలోనూ వృద్ధి నమోదైందని తెలిపారు.

గడచిన రెండు నెలల గణాంకాలనూ పరిశీలిస్తే, అతి త్వరలోనే కరోనా పూర్వపు స్థితికి దేశం చేరుకుంటుందని అనిపిస్తోందని అజయ్ భూషణ్ వ్యాఖ్యానించారు. గత సంవత్సరం సెప్టెంబర్ తో పోలిస్తే, ఈ-వే బిల్లుల విషయంలోనూ 10 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. మరో ఐదు నెలల పాటు ఇదే తరహా వృద్ధి రేటు నమోదుకావాల్సి వుంటుందని, అంటే, మార్చి నాటికి పాజిటివ్ వృద్ధికి దేశం చేరుకుంటుందని అంచనా వేశారు.

  • Loading...

More Telugu News