PV Sindhu: 'నేను రిటైరవుతున్నా' అంటూ అందరికీ షాక్ ఇచ్చిన పీవీ సింధు... తీరా చూస్తే అసలు విషయం ఇదీ!

PV Sindhu retirement statement confuses all sectors
  • తన ప్రకటన మొదట్లో రిటైరవుతున్నట్టు వెల్లడి
  • కానీ మధ్యలోనే ట్విస్ట్ ఇచ్చిన సింధు
  • ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి నుంచి రిటైరవుతున్నట్టు వివరణ
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు అందరినీ గందరగోళానికి గురిచేసింది. తాను రిటైర్ అవుతున్నట్టు సింధు తన పోస్టులో ప్రకటించింది.  అయితే తన ప్రకటన మొత్తం చదివితే ఆమె రిటైరవుతున్నది క్రీడ నుంచి కాదని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం నుంచి అని అర్ధమవుతుంది. తన లేఖ మొత్తం చదివితే తాను తీసుకున్న నిర్ణయం సబబేనని అందరూ అంగీకరిస్తారని సింధు తన ప్రకటనలో పేర్కొంది.

"ఈ లేఖ మొదట్లో మీరు షాక్ అవుతారు, అయోమయానికి గురవుతారు. లేఖ పూర్తిగా చదివిన పిమ్మట మీరు కూడా నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. ఈ కరోనా మహమ్మారి నాకో కనువిప్పు. కఠినమైన ప్రత్యర్థులను ఓడించేందుకు కఠోరంగా సాధన చేయొచ్చు. మ్యాచ్ లో చివరి షాట్ వరకు హోరాహోరీగా పోరాడవచ్చు. గతంలో నేను ఇలా చేశాను కూడా. కానీ ప్రపంచాన్నంతటినీ కట్టిపడేస్తున్న ఈ కంటికి కనిపించని వైరస్ మహమ్మారితో పోరాడడం ఎలా?

నెలల తరబడి ఇంట్లోనే ఉన్నాం, బయటికి వచ్చే ప్రతిసారి భయపడాల్సిన పరిస్థితి! కరోనా పరిస్థితుల నేపథ్యంలో హృదయాలు ద్రవించే గాథలు వింటున్నాం. అయితే నేను ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నా. ఈ ప్రతికూల వాతావరణం నుంచి రిటైరవుతున్నా. వదలక వెంటాడుతున్న భయం, సందిగ్ధత నుంచి రిటైర్ అవుతున్నా. ముఖ్యంగా, మన నాసిరకం పరిశుభ్రతా ప్రమాణాల నుంచి రిటైర్ అవుతున్నా, వైరస్ అంటే ఏముందిలే అనే నిర్లక్ష్య ధోరణి నుంచి రిటైర్ అవుతున్నా.

నికార్సయిన పోరాటం లేకుండా మ్యాచ్ ను అప్పగించడం నాకు తెలియదు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఇదే పోరాటాన్ని నేను, మనం సురక్షితమైన ప్రపంచం సాకారమయ్యేదాకా కొనసాగిద్దాం" అంటూ సింధు సుదీర్ఘ ప్రకటన చేసింది.
PV Sindhu
Retirement
Statement
Post
Social Media
Badminton
India

More Telugu News