RTC Buses: తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం... ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు
- తెలుగు రాష్ట్రాల మధ్య తొలగిన ప్రతిష్టంభన
- ఒప్పందంపై సంతకాలు చేసిన ఆర్టీసీ అధికారులు
- చెరో 1.60 లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పుకునేందుకు అంగీకారం
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడంపై ప్రతిష్టంభన తొలగిపోయింది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదరడంతో ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి.
దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. కేంద్రం ప్రయాణ ఆంక్షలు సడలించినా, ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య ఒప్పందం కుదరని కారణంగా ఇన్నాళ్లు బస్సులు రోడ్డెక్కలేదు. అయితే, తాజాగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు మరోసారి సమావేశం కాగా, సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల స్థాయిలో ఈ కీలక సమావేశం జరిగింది. అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఓ అవగాహనకు రావడంతో ఒప్పందం ఖరారైంది. ఈ క్రమంలో నేటి అర్ధరాత్రి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు తిరగనున్నాయి.
కుదిరిన ఒప్పందం ప్రకారం.... టీఎస్ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ లో 1,61,258 కిలోమీటర్ల మేర తిరగనున్నాయి. అదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కిలోమీటర్ల మేర తిరిగేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.
తాజా ఒప్పందంలో భాగంగా... ఇకపై ఏపీ నుంచి తెలంగాణకు 638 బస్సులు తిరుగుతాయి. లాక్ డౌన్ కు ముందు ఈ సంఖ్య 1,009గా ఉండేది. అదే సమయంలో టీఎస్ఆర్టీసీ ఇకపై ఏపీకి 820 బస్సు సర్వీసులు నడపనుంది. గతంలో టీఎస్ఆర్టీసీ 750 సర్వీసులకే పరిమితమైంది.