IPL 2020: ఢిల్లీ చేతిలో ఓడిన బెంగళూరు.. అయినా గండం గట్టెక్కిన కోహ్లీసేన!

Delhi capitals won by 6 wickets over bengaluru

  • విజయం కోసం ఢిల్లీని 19వ ఓవర్ వరకు ఆడించిన బెంగళూరు
  • నెట్ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్త పడి మూడో స్థానంలోకి
  • 2016 తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్‌లోకి కోహ్లీ టీం

ప్లే ఆఫ్స్‌కు ఒక్క అడుగు ముంగిట వరుస పరాజయాలతో బెర్త్‌ను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ ఎట్టకేలకు విజయం సాధించగా, బెంగళూరు మాత్రం పరాజయాల నుంచి బయటపడలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్ కోసం జరిగిన ఈ పోరులో విజయం సాధించిన, ఓడిన జట్లు రెండూ అర్హత సాధించడం విశేషం.

బెంగళూరు నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ 17. 3 ఓవర్ల వరకు ఆడేలా చూడడంలో బెంగళూరు బౌలర్లు సఫలమయ్యారు. ఫలితంగా రన్‌రేట్ పడిపోకుండా చూసుకున్నారు. -0.172 నెట్ రన్‌రేట్‌తో కోల్‌కతా కంటే మెరుగ్గా ఉండడంతో కోహ్లీ సేన ఓడినప్పటికీ మూడో స్థానంలో నిలిచింది. ఇక నేడు ముంబై, హైదరాబాద్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుండగా, హైదరాబాద్ విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఓడితే కోల్‌కతాకు చాన్స్ లభిస్తుంది.

గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ మరోమారు ఆల్‌రౌండర్ ప్రతిభతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పృథ్వీషా (9) మరోమారు విఫలమైనప్పటికీ శిఖర్ ధవన్, అజింక్య రహానేలు బ్యాట్ ఝళిపించారు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును ముందుకు ఉరికించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు.

41 బంతుల్లో 6 ఫోర్లతో  54 పరుగులు చేసిన ధవన్ షాబాజ్ అహ్మద్ బౌలింగులో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (7), నిరాశ పరచగా, ఆ తర్వాత కాసేపటికే 46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 60 పరుగులు చేసిన రహానే కూడా వెనుదిరిగాడు. అయితే, అప్పటికే జట్టు విజయం ముంగిట నిలిచింది. రిషభ్ పంత్ (8), స్టోయినిస్ (10)లు మిగిలిన పనిని పూర్తి చేసి జట్టును ప్లే ఆఫ్స్‌లోకి తీసుకెళ్లారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు పడిక్కల్ పుణ్యమా అని 152/7 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఫిలిప్ (12), మోరిస్ (0), ఉడానా (4)లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. అయితే, క్రీజులో కుదురుకున్న పడిక్కల్ ఒక్కడే ఢిల్లీ బౌలర్లతో పోరాడాడు. 41 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ సెంచరీ (50) పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ 29, డివిలియర్స్ 35, శివం దూబే 17 పరుగులు చేశారు.

ఢిల్లీ బౌలర్లలో నార్జ్ 3 వికెట్లు పడగొట్టగా, రబడ 2, అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నారు. మూడు వికెట్లు పడగొట్టి బెంగళూరును స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన నార్జ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఓడినప్పటికీ ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించిన బెంగళూరుకు ఆ బెర్త్ దక్కడం 2016 తర్వాత ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News