Uttarakhand: ఉత్తరాఖండ్ లో నిన్న మొదలైన స్కూళ్లు... ఓ విద్యార్థికి కరోనా!
- తిరిగి తెరచుకున్న పాఠశాలలు
- విద్యార్థికి కరోనా రావడంతో స్కూల్ మూత
- అతనితో ఉన్న 15 మంది క్వారంటైన్ కు
దాదాపు 7 నెలల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా, తొలిరోజునే ఓ విద్యార్థికి కరోనా సోకడంతో ఉత్తరాఖండ్ లోని రాణిఖేట్ పట్టణంలో కలకలం రేపింది. ఇక్కడి ఓ పాఠశాలకు తొలిరోజు వచ్చిన విద్యార్థికి కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో, అతనితో పాటు గదిలో కూర్చున్న 15 మందినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు.
ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి జేసీ పాండే, పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించామని, స్కూల్ గదులు, ఆవరణను శానిటైజ్ చేయనున్నామని అన్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 3,941 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 1,027 మంది చనిపోగా, 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.