PSLV-C49: ఈ నెల 7న పీఎస్ఎల్వీ-49 ప్రయోగం.. 6న కౌంట్‌డౌన్ ప్రారంభం
- పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో రెండోది
- స్వదేశీ ఉపగ్రహంతోపాటు 9 దేశాల ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న రాకెట్
- 13.55 నిమిషాల్లోనే ముగియనున్న ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 7న సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ-సి49 (పీఎస్ఎల్వీ-డీఎల్) ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా స్వదేశీ ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్-10తోపాటు 9 దేశాలకు చెందిన తేలికపాటి ఉపగ్రహాలను భూమికి అత్యంత చేరువలో సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. 13.55 నిమిషాల్లోనే ప్రయోగం ముగుస్తుంది.
పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం కానుండగా, తొలిసారి గతేడాది జనవరి 24న ప్రయోగించారు. తేలికపాటి ఉపగ్రహాలు కావడంతో ఖర్చును వీలైనంత వరకు తగ్గించుకునేందుకు ఇందులో రెండు స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించారు. ప్రయోగం కోసం ఈ నెల 6న మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం జరగనుంది.