TS DGP: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో.. డీజీపీ, అదనపు సీఈఓలకు టీపీసీసీ నేతల ఫిర్యాదు
- చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు నకిలీ వార్తలు
- సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం
- ఫిర్యాదు చేసిన ఉత్తమ్, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్
దుబ్బాక ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కొందరు నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తుండడం పట్ల డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు తెలంగాణ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి బుద్ధప్రకాశ్‌ను టీపీసీసీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేసింది. దుబ్బాక ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎన్నికల అదనపు ప్రధాన అధికారి బుద్ధప్రకాశ్‌ను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి మీద తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. పోలింగ్ ముగిసేలోపు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.