Sourav Ganguly: రోహిత్ శర్మను ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయకపోవడంపై సౌరవ్ గంగూలీ వివరణ
- ఐపీఎల్ లో గాయపడిన రోహిత్
- ఆసీస్ టూర్ కు దక్కని బెర్తు
- రోహిత్ నెట్ ప్రాక్టీసు వీడియోను పోస్టు చేసిన ముంబయి ఇండియన్స్
- బోర్డుపై ధ్వజమెత్తిన విమర్శకులు
డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఐపీఎల్ లో గాయపడడంతో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. అదేసమయంలో ఆసీస్ టూర్ కు టీమిండియాను ఎంపిక చేస్తూ రోహిత్ శర్మను పక్కనబెట్టారు. అదేరోజున రోహిత్ నెట్ ప్రాక్టీసు వీడియోను ముంబయి ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో విమర్శకులు రెచ్చిపోయారు. రోహిత్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదంటూ ప్రశ్నించారు. తాజాగా రోహిత్ గాయం నుంచి కోలుకుని ఇవాళ సన్ రైజర్స్ తో మ్యాచ్ లో బరిలో దిగాడు.
విమర్శలు వస్తుండడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు. రోహిత్ శర్మకు ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడే సత్తా ఉందని, ఒక సిరీస్ లో ఆడనంత మాత్రాన నష్టపోయేదేమీ ఉండదని అన్నారు. టీమిండియాకు రోహిత్ ఓ విలువైన ఆటగాడని, అతడిని జట్టులోకి తెచ్చేందుకు బోర్డు తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. రోహిత్ గాయపడ్డాడు కాబట్టే ఎంపిక చేయలేదని గంగూలీ వెల్లడించారు. "రోహిత్ టీమిండియాకు వైస్ కెప్టెన్ కూడా. అతడ్ని మేం పర్యవేక్షిస్తాం. నాణ్యమైన ఆటగాళ్లు జట్టులో ఉండేలా చూడడమే బోర్డు విధి" అని తెలిపారు.