Sunrisers Hyderabad: కీలక మ్యాచ్ లో ముంబయి బ్యాట్స్ మెన్ కు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు
- షార్జాలో ముంబయి వర్సెస్ హైదరాబాద్
- మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్
- 3 వికెట్లు తీసిన సందీప్ శర్మ
షార్జా క్రికెట్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు అమోఘంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ, బలమైన ముంబయి జట్టును సమర్థంగా నిలువరించారు. సన్ రైజర్స్ బౌలింగ్ కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ కూడా తోడవడంతో ముంబయి బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేశారు.
కీరన్ పొలార్డ్ ధాటిగా ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా పొలార్డ్ ఐపీఎల్ లో 3000 పరుగుల మార్కు అధిగమించాడు.
అంతకుముందు డికాక్ 25, సూర్యకుమార్ యాదవ్ 36, ఇషాన్ కిషన్ 33 పరుగులు చేశారు. రోహిత్ శర్మ (4), కృనాల్ పాండ్య (0), సౌరభ్ తివారీ (1) విఫలమయ్యారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3, జాసన్ హోల్డర్ 2, షాబాజ్ నదీమ్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.