Anand Mahindra: ఇంటిపై స్కార్పియో వాహనం... ఆనంద్ మహీంద్రా మెచ్చుకోలు!
- కారును పోలిన ట్యాంకు తయారుచేయించిన ఇంటి యజమాని
- ఇంటి యజమాని నిర్ణయాన్ని అభినందించిన మహీంద్రా
- అతడి మమకారానికి సెల్యూట్ అంటూ ట్వీట్
ఓవైపు వ్యాపార లావాదేవీలతో ఎంతో బిజీగా ఉండే బిజినెస్ మాగ్నెట్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాకు కూడా తగిన సమయం కేటాయిస్తుంటారు. తన దృష్టికి వచ్చే అంశాలను అందరితో పంచుకునేందుకు ఆయన ఆసక్తి చూపుతుంటారు. తాజాగా బీహార్ లోని భాగల్ పూర్ కు చెందిన ఓ వ్యక్తి నివాసంపైన కారు ఆకారాన్ని పోలిన వాటర్ ట్యాంకును చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు.
ఆనంద్ స్పందించడానికి అసలు కారణం ఆ వాటర్ ట్యాంకు మహీంద్రా స్కార్పియో వాహనాన్ని పోలి ఉండడమే. ఆ ఇంటి యజమాని ఇంతెజార్ ఆలం ఆ కారు ఆకారంలోని వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం రూ.2.50 లక్షలు ఖర్చు చేశాడు. ఆగ్రాకు చెందిన నిపుణులను రప్పించి అచ్చం కారును పోలిన ట్యాంకు నిర్మించుకున్నాడు. తన ఇంటి ఫొటోను ఆలం సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది.
"నేను ఇప్పుడు ఏదైనా ఎదుగుదలకు చెందిన ఉదంతం చెప్పాల్సి వస్తే.... స్కార్పియో కారు ఇంటి పైకప్పు మీదకు కూడా చేరుతోందన్న విషయం చెప్పాలి. ఏదేమైనా ఆ ఇంటి యజమానికి సలాం చేస్తున్నాను. తన మొట్టమొదటి కారుపై అతను చూపిన మమకారం పట్ల సెల్యూట్ చేస్తున్నాను" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.