Diago Maradona: ఫుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనాకు బ్రెయిన్ సర్జరీ!
- మెదడులో గడ్డ కట్టిన రక్తం
- సోమవారం నాడు ఆసుపత్రికి తరలింపు
- అభిమానుల్లో ఆందోళన
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన డిగో మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టడంతో బ్రెయిన్ సర్జరీ చేయనున్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యుడు లియోపోల్డో లూక్యూ వెల్లడించారు. అయితే ఇది సాధారణమైన శస్త్రచికిత్సేనని, తానే స్వయంగా చేయనున్నానని తెలిపారు. సోమవారం నాడు అస్వస్థతగా ఉందని 60 ఏళ్ల మారడోనా చెప్పడంతో, ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆపై వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో రక్తం గడ్డకట్టి ఉన్నట్టు తేలింది. ఈ వార్త బయటకు రాగానే, అర్జెంటీనా మీడియా దీన్ని ప్రముఖంగా ప్రచురించింది. తలకు తగిలిన దెబ్బ కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. తొలుత ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని భావిస్తున్నారని చెప్పిన లియోపోల్డో, ఆపై కాసేపటికే, చాలా బలహీనంగా ఉన్నారని, ఆసుపత్రిలో మరికొంతకాలం ఉండాలని చెప్పడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఆయన్ను సౌత్ బ్యూనస్ ఎయిర్స్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లా ప్లాటా ఆసుపత్రికి తరలించి ఆపరేషన్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మారడోనాకు కరోనా కూడా సోకిందని వార్తలు రాగా, వాటిని ఖండించారు. గత వారంలో తన బాడీగార్డుకు కరోనా సోకడంతో మారడోనా రెండోసారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అయితే, పరీక్షల తరువాత ఆయనకు నెగటివ్ వచ్చింది.