Arnab Goswami: ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి అరెస్టు.. చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చిన వైనం

Republic TV editor Arnab Goswami arrested in 2018 suicide abetment case

  • ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆత్మహత్యకేసులో అరెస్టు?
  • కుటుంబ సభ్యులపైనా భౌతిక దాడికి దిగారన్న గోస్వామి
  • వీడియోలు, ఫొటోలు వైరల్
  • దేశంలోని ప్రజలు ఖండించాలన్న రిపబ్లిక్ టీవీ

మహారాష్ట్రలోని అలీబాగ్ పోలీసులు ఈ రోజు ఉదయం రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 2018లో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం టీఆర్‌పీ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటూ చిక్కుల్లో పడ్డ గోస్వామి మరిన్ని కష్టాల్లో పడ్డారు.

అర్నాబ్ గోస్వామి అరెస్టుపై రిపబ్లిక్ టీవీ స్పందిస్తూ పలు ఆరోపణలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని తన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసే క్రమంలో భౌతిక దాడికి దిగారని తెలిపింది. ఈ ఘటనను దేశంలోని ప్రజలు ఖండించాలని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది.

అర్నాబ్ గోస్వామిపై పోలీసులు దాడికి దిగి, ఆయనను చొక్కాపట్టుకుని బయటకు లాక్కొచ్చి పోలీసు వ్యాను ఎక్కించి తీసుకెళ్లారని తెలుపుతూ రిపబ్లిక్ టీవీ ఓ వీడియోను కూడా ప్రసారం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ  వైరల్ అవుతున్నాయి. కాగా, తనతో పాటు తన అత్తయ్య, మామయ్య, కుమారుడు, భార్యపై కూడా పోలీసులు భౌతిక దాడి చేశారని అర్నాబ్ గోస్వామి చెప్పారు.

కాగా, ముంబైలో 2018, మేలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. గోస్వామితో పాటు ఫెరోజ్ షెయిక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు.

అయితే, ఈ కేసులో దర్యాప్తు జరిపిన రాయ్‌గడ్ పోలీసులకు అందుకు తగ్గ ఆధారాలు లభ్యం కాకపోవడంతో 2019 లో ఈ కేసును మూసివేశారు. ఈ ఏడాది మేలో   మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసు విషయంపై అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్యనాయక్ ఆశ్రయించి, పోలీసులు ఈ కేసులో సరైన విచారణ జరపలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కొత్తగా సీఐడీ విచారణ జరుపుతుందని హోం మంత్రి ప్రకటించారు.
  

  • Loading...

More Telugu News