Tejashwi Yadav: తన ప్రత్యర్థి నితీశ్ కుమార్ పై ఉల్లిగడ్డలు విసరడంపై తేజశ్వి యాదవ్ ఆగ్రహం

Tejashwi Yadav Condemns Onion Hurling At Nitish Kumar
  • మధుబని ఎన్నికల ర్యాలీలో నితీశ్ పై ఉల్లిగడ్డలతో దాడి
  • ఘటనను ఖండించిన తేజశ్వి
  • మన పోరాటం సమస్యల పైన మాత్రమే అని వ్యాఖ్య
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కీలక నేతలపై చెప్పులు విసరడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడుతున్న జేడీయూ అధినేత, ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజశ్విపై చెప్పులు విసిరిన ఘటనలు కలకలం రేపాయి.

ముఖ్యంగా ఎన్నికల ర్యాలీలో తేజశ్వి కంటే నితీశ్ కుమార్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ పై దుండగులు ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సందర్భంగా నితీశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా విసరండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తేజశ్వి యాదవ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నితీశ్ పై ఉల్లిగడ్డలను విసిరిన ఘటనను తాను ఖండిస్తున్నానని తేజశ్వి చెప్పారు. మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి వేరే విధానాలు కూడా ఉన్నాయని అన్నారు. తామంతా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తున్నామని... ఇలాంటి దాడులు సరికాదని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన నితీశ్ ప్రభుత్వం... ఉద్యోగాలను కల్పించలేదని విమర్శించారు. వరదల వల్ల అతలాకుతలమైన ప్రదేశాల్లో కూడా పరిస్థితిని పట్టించుకోలేదని చెప్పారు. మూడో విడత పోలింగ్ లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుందని అన్నారు. నితీశ్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు.
Tejashwi Yadav
RJD
Nitish Kumar
JDU
Bihar

More Telugu News