Pinaka: లక్ష్యాన్ని తుత్తునియలు చేసిన ‘పినాక’.. పరీక్ష విజయవంతం
- ఏక కాలంలో ఆరు రాకెట్లను పరీక్షించిన డీఆర్‌డీవో
- గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించిన పినాక
- త్వరలోనే భారత ఆర్మీలో చేరిక
భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధి చేసిన పినాక మల్టీ-బ్యారెల్ రాకెట్ సిస్టం (ఎంఆర్ఎల్ఎస్) అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు విజయవంతంగా పరీక్షించారు. త్వరలోనే ఇది భారత ఆర్మీలో చేరనుంది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి వీటిని పరీక్షించారు. గత వేరియంట్ (ఎంకే-1)తో పోలిస్తే ఇది తక్కువ పొడవుతో, ఎక్కువ పరిధిని కలిగి ఉంటుందని డీఆర్‌డీవో తెలిపింది. డీఆర్‌డీవో పూణె లేబొరేటరీలో దీనిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది.
అతి తక్కువ వ్యవధిలో మొత్తం ఆరు రాకెట్లను లాంచ్ చేయగా, అవన్నీ పూర్తి మిషన్ లక్ష్యాలను చేరుకున్నట్టు పరీక్షల అనంతరం డీఆర్‌డీవో తెలిపింది. వీటన్నింటినీ టెలిమెట్రీ, రాడార్, ఎలెక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఈఓటీఎస్) వంటి శ్రేణి పరికరాల ద్వారా ట్రాక్ చేసి వాటి పనితీరును ధ్రువీకరించినట్టు వివరించింది. పినాక అప్‌గ్రేడెడ్ వెర్షన్ రాకెట్లు ప్రస్తుతం ఉన్న పినాక ఎంకే-1 రాకెట్ల స్థానాన్ని భర్తీ చేస్తాయని పేర్కొంది. ఎంకే-1 రేంజ్ 36 కిలోమీటర్లు కాగా, అభివృద్ధి చేసిన వేరియంట్ రాకెట్ 45 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని డీఆర్‌డీవో తెలిపింది. చైనాకు కౌంటర్‌గా వీటిని మోహరించే అవకాశం ఉంది.