School: ఈ స్కూలు ప్రత్యేకతే వేరు.. జాతకం చూసికానీ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వరు!
- నలంద, తక్షశిల మాదిరి విద్యా బోధనే లక్ష్యం
- జ్యోతిష్యం, ఆయుర్వేదం తదితర అంశాల్లో బోధన
- నేషనల్ ఓపెన్ స్కూలు ద్వారా విద్యార్థులకు పరీక్షలు
గుజరాత్ లో ఉన్న ఈ స్కూలు ప్రత్యేకతే వేరు. జాతకం చూసిన తర్వాతకానీ ఈ పాఠశాలలో సీటు ఇవ్వరు. అహ్మదాబాద్ సబర్మతిలోని హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాలలో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. స్కూలు అడ్మినిస్ట్రేటర్ అఖిల్ ఉత్తమ్ షా వెల్లడించిన వివరాల ప్రకారం... నలంద, తక్షశిల మాదిరి పురాతన విద్యా విధానాన్ని తీసుకురావడమే ఈ స్కూల్ లక్ష్యం.
ఈ పాఠశాలలో జ్యోతిష్యం, ఆయుర్వేద, భాష, వేద గణితం, వ్యాకరణం, యోగా, సంగీతం, కళలు, గుర్రపు స్వారీ, వాస్తు, న్యాయ విద్య వంటి ఎన్నో విషయాలను బోధిస్తారు. వీటి పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత వారి జాతకం చూసి అడ్మిషన్ ఇస్తారు. వారి నుంచి రూ. 3 వేలు వసూలు చేస్తారు.
ఈ పాఠశాల విద్యార్థి అయిన తుషార్ తలావత్ వేద గణిత పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నాడు. తమ పాఠశాలకు ఎన్నో బహుమతులు తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వ సత్కారాలను కూడా పొందాడు. అయితే, ఈ స్కూలుకి రాష్ట్ర విద్యాశాఖ గుర్తింపు లేదు. అందువల్ల ఎలాంటి సర్టిఫికెట్లను ఈ స్కూలు ఇవ్వదు. అయితే, నేషనల్ ఓపెన్ స్కూలు ద్వారా తమ విద్యార్థుల చేత పరీక్షలు రాయిస్తుంది.