Donald Trump: దాదాపుగా గెలిచేసిన బైడెన్... అంతా మోసమంటున్న ట్రంప్!
- విజయానికి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లు
- 264 ఓట్లను సాధించిన జో బైడెన్
- 214 ఓట్లకే పరిమితమైన డొనాల్డ్ ట్రంప్
- పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, నెవెడా, అలస్కా రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్
538 ఎలక్టోరల్ ఓట్లున్న అమెరికాలో మేజిక్ ఫిగర్ 270 కాగా, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ 264 ఓట్లను సాధించారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లకే పరిమితం అయ్యారు. తొలి నుంచి ట్రంప్ కు అనుకూలంగా ఉన్న విస్కాన్సిస్, మిచిగన్ రాష్ట్రాల్లో చివరి గంటల్లో అనూహ్యంగా బైడెన్ పుంజుకుని, గెలవడంపై ట్రంప్ మండిపడ్డారు. ఈ రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఆయన ఆరోపించారు.
ఇప్పటికీ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, నెవెడా, అలస్కా రాష్ట్రాల్లో తుది ఫలితం వెల్లడి కావాల్సి వుంది. నెవెడా మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో కూడా బైడెన్ నుంచి ఆయన గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఇక, ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో 50.3 శాతం జో బైడెన్ కు, 48.1 శాతం డొనాల్డ్ ట్రంప్ కు వచ్చాయి. 7,14,52,650 పాప్యులర్ ఓట్లు బైడెన్ కు రాగా, 6,82,23,592 ఓట్లు ట్రంప్ కు వచ్చాయి.
అమెరికన్లందరూ కలసికట్టుగా ఈ విజయాన్ని సాధించారని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇక, చివరి వరకూ తాను ఆధిక్యంలో ఉన్న మిచిగన్ లో బైడెన్ గెలవడాన్ని ట్రంప్ ఏ మాత్రమూ తట్టుకోలేకపోయారు. ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. అందరూ తనను మోసం చేస్తున్నారని, తాను కోర్టుకు వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు.