Antivirus tiffin centre: భువనేశ్వర్‌లో ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’.. ఫొటోలు తెగ వైరల్
- లివప్ ద ట్రెండ్ అనే క్యాప్షన్
- వివిధ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
- టిఫిన్లలో శానిటైజర్ కలపరు కదా అంటూ జోకులు
కరోనా మహమ్మారి ఏమంటూ ప్రపంచంపై పగబట్టిందో కానీ ప్రజల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంస్కృతి, సంప్రదాయాలపైనా పెను ప్రభావం చూపింది. జీవన విధానం మొత్తం వైరస్‌తో ముడిపడిపోయింది. మనిషి ఏ పని చేసినా దానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా వైరస్‌తో ముడిపడే ఉంటోంది.
తాజాగా, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ టిఫిన్ సెంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాని పేరు ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ కావడమే వైరల్ అవడం వెనకున్న అసలు కారణం. ‘లివప్ ద ట్రెండ్’ అనే క్యాప్షన్ తగిలించిన ఈ హోటల్‌లో ఓన్లీ స్టాండింగ్.. నో సీటింగ్.
ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ దానిని మరింత వైరల్ చేస్తున్నారు. ‘కొంపదీసి టిఫిన్లలో శానిటైజర్ కలపరు కదా’ అని ఒకరు కామెంట్ చేస్తే.., ‘వంట మాస్టర్ మాస్క్, గ్లౌజులు ధరించకుండా వంట చేస్తే, సర్వర్లు కూడా అలాగే వడ్డిస్తారు’ అదే ఇక్కడి స్పెషల్ అని మరొకరు రాశారు. ‘ఇక్కడ గ్రేడ్ ఎ బ్లీచ్‌ను మాత్రమే కలుపుతారు’ అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.