16 Years Girl: 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారం కారణంగా గర్భవతి.. బిడ్డకు జన్మనిచ్చిన టీనేజ్ అమ్మాయి!
- 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
- భయంతో తల్లికి కూడా చెప్పని బాధితురాలు
- బిడ్డకు జన్మనిచ్చి షాప్ వద్ద వదిలి వెళ్లిన వైనం
దేశ రాజధాని ఢిల్లీలో హృదయం ద్రవించే ఘటన చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక తన ఇంటి టెర్రెస్ పై బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం... అక్టోబర్ 31న వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్లారని ఫోన్ లో ఎవరో చెప్పారు. వెంటనే ఆ అడ్రస్ కు వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ బిడ్డ ఎవరనే విషయం మాత్రం పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పలేదు. దీంతో, వారు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక వద్ద బిడ్డ ఉన్న సన్నివేశాలు ఫుటేజీలో ఉన్నాయి.
ఫుటేజీ ఆధారంగా సదరు బాలికను పోలీసులు ట్రేస్ చేశారు. ఆమెను విచారించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎనిమిది, తొమ్మిది నెలల క్రితం 60 ఏళ్ల ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వెల్లడించింది. అయితే, భయంతో ఆ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పలేదని తెలిపింది. ఇంటి టెర్రెస్ పై బిడ్డకు జన్మనిచ్చానని చెప్పింది. ఆ తర్వాత బిడ్డను వస్త్రంతో కప్పి, ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద వదిలి వెళ్లానని తెలిపింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేప్ చేసిన వ్యక్తి బాలిక ఇంటి వద్దే ఓ కిరాణా షాపును నడుపుతున్నాడు. బాలిక తల్లి ఇళ్లల్లో పనిచేస్తుంది.