Andhra Pradesh: ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం.. పలువురు విద్యార్థులు, టీచర్లకు కరోనా
- ఈ నెల 2న ప్రారంభమైన పాఠశాలలు
- చిత్తూరు జిల్లాలో 120 మంది టీచర్లకు కరోనా
- తీవ్ర ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 2 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ పాఠశాలలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. 10 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు తేలింది.
దీంతో, వారందరినీ వెంటనే పాఠశాల నుంచి ఇంటికి పంపించేశారు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 120 మంది టీచర్లకు కరోనా సోకింది. ఓ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మహమ్మారి బారిన పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలం గంగలకుర్రు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో వంట చేసే మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.