Ambika Group: సీబీఐ దాడులపై వివరణ ఇచ్చిన అంబికా గ్రూప్
- అంబికా అగర్ బత్తీ సంస్థపై సీబీఐ దాడులంటూ కథనాలు
- మీడియా కథనాలపై అంబికా గ్రూప్ ఖండన
- త్రినేత్ర సంస్థ గురించి వివరాలు మాత్రమే అడిగారంటూ స్పష్టీకరణ
ఏలూరులోని అంబికా అగర్ బత్తీ సంస్థ కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయంటూ మీడియాలో కథనాలు రావడం తెలిసిందే. దీనిపై అంబికా సంస్థల యాజమాన్యం తమ న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చింది. అంబికా సంస్థల కార్యాలయాల్లో సీబీఐ దాడులు జరగలేదని స్పష్టం చేసింది. అంబికా సంస్థల షేర్లను కొనుగోలు చేసిన త్రినేత్ర ఇన్ ఫ్రా వెంచర్స్ అనే సంస్థకు సంబంధించిన వివరాలు మాత్రమే సీబీఐ అధికారులు అడిగారని ఓ ప్రకటనలో వెల్లడించింది.
త్రినేత్ర ఇన్ ఫ్రా సంస్థపై కేసులుండగా, ఆ సంస్థపై విచారణ నేపథ్యంలో సీబీఐ అధికారులు తమను సంప్రదించారే తప్ప, తమ కార్యాలయాలపై దాడులు చేసేందుకు రాలేదని వివరించింది. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కోరిన సమాచారాన్ని తమ సంస్థ అందించిందని, అంతే తప్ప తమపై దాడులు జరిగాయన్న వార్తల్లో నిజంలేదని అంబికా సంస్థల తరఫున హైకోర్టు న్యాయవాది సి.రఘు ప్రకటన చేశారు. ఈ మీడియా కథనాలను తమ క్లయింట్లు ఖండిస్తున్నారని తెలిపారు.