Michigan: అమెరికా ప్రతినిధుల సభకు వరంగల్ మహిళ పద్మ కుప్ప
- రాష్ట్రస్థాయి ఎన్నికల్లో విజయం సాధించిన 13 మందిలో ఐదుగురు మహిళలే
- వరంగల్ నిట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన పద్మ
- మిచిగాన్ సభకు రెండోసారి ఎన్నికైన రికార్డు
అమెరికాలో జరిగిన ఎన్నికల్లో భారతీయ మహిళలు సత్తా చాటుతున్నారు. కాంగ్రెస్ ప్రతినిధుల సభ, వివిధ రాష్ట్రాల ప్రతినిధుల సభలు, సెనేట్‌లు, మరికొన్ని పదవులకు భారతీయ అమెరికన్లు ఎన్నికయ్యారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటి వరకు 13 మంది ఎన్నికవగా వారిలో ఐదుగురు మహిళలే ఉన్నారు. ముఖ్యంగా మిచిగాన్ సభకు డెమోక్రాట్ల తరపున ఎన్నికైన పద్మ కుప్ప వరంగల్ వాసి కావడం గమనార్హం. భారతీయ అమెరికన్ల గెలుపు అమెరికా రాజకీయాల్లో పెద్ద ముందడుగని అభివర్ణిస్తున్నారు.
మిచిగాన్ 41వ జిల్లా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన పద్మ కుప్ప ఈ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా, హిందువుగా రికార్డులకెక్కారు. పద్మ 1966లో వరంగల్‌లో జన్మించారు. నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిన పద్మ అక్కడే చదువుకున్నారు. 1981లో తిరిగి భారత్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని స్టాన్లీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు.
అనంతరం వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్‌ఈసీ)లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తిరిగి 1988లో విద్యార్థిగా అమెరికా వెళ్లారు. భర్త సుధాకర్ తాడేపల్లి, ఇద్దరు పిల్లలతో మిచిగాన్‌లోని ట్రాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడే ట్రాయ్ ప్లానింగ్ కమిషనర్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో తొలిసారి డెమొక్రటిక్ పార్టీ తరపున రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికైన పద్మ.. తాజా ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు.