Panchumarthi Anuradha: ఒకే సామాజిక వర్గానికి 870 పోస్టులా?: పంచుమర్తి అనురాధ
- జగన్ పాలనలో సంక్షేమం చచ్చిపోయింది
- ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది
- వైసీపీ పాలనలో 600కు పైగా అత్యాచారాలు జరిగాయి
ముఖ్యమంత్రి జగన్ పాలన దారుణంగా ఉందని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో సంక్షేమం చచ్చిపోయిందని అన్నారు. ప్రజా సంక్షేమానికి నూరేళ్లు నిండిపోయాయని విమర్శించారు. జనాలకు ఒక చేత్తో డబ్బులిచ్చి... మరో చేత్తో లాక్కోవడమే జగన్ విధానమని చెప్పారు. జగన్ సీఎం కావడం వల్ల ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. కులం ప్రామాణికం కాదని చెప్పుకునే జగన్... ఒకే సామాజికవర్గానికి 870 పోస్టులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
పేదల కన్నీళ్లు తుడిచామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోందని... దళితులకు శిరోముండనం చేయడమేనా కన్నీళ్లు తుడవడమంటే? అని ప్రశ్నించారు. 17 నెలల కాలంలో రాష్ట్రంలో 600లకు పైగా అత్యాచారాలు జరిగాయని... వీటికి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. చట్ట రూపమే దాల్చని దిశ చట్టంతో ఏం ప్రయోజనమని ఎద్దేవా చేశారు. ప్రజలపై అప్పుడే రూ. 50 వేల కోట్లకు పైగా పన్నుల భారం మోపారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత మందికి లబ్ధిని చేకూర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.