L Ramana: మీరు చెప్పిన పంటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు: సీఎం కేసీఆర్ కు తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ లేఖ
- నియంత్రిత సాగు రైతులను దెబ్బతీసిందన్న రమణ
- రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని వెల్లడి
- ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్
నియంత్రిత సాగు విధానంలో ప్రభుత్వం చెప్పిన మాట విని రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసిన రైతులకు మేలు జరగలేదని విమర్శించారు. నియంత్రిత సాగు పద్ధతిలో 24 లక్షల ఎకరాల్లో సన్న వరి సాగు చేశారని, సన్న రకాల వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించలేదని తెలిపారు. అధికారులు కానీ, మిల్లర్లు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ సన్న వరిని ఏ ధరకు కొనుగోలు చేయాలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు.
కేంద్రం క్వింటాకు రూ.1,888 ధర ప్రకటించిందని, ఇప్పుడు సన్న వరిని కూడా అదే ధరకు కొనుగోలు చేస్తామంటున్నారని ఎల్.రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు, తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు ధరపై ప్రకటన రాకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని వెల్లడించారు.
గతంలో సన్న ధాన్యానికి మిల్లర్లు క్వింటాకు రూ.2,500 చెల్లించేవారని, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఎకరాకు రూ.20 వేల మేర నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లపై తమ విధానం వెల్లడించాలని, క్వింటాకు మద్దతు ధర పైన మరో రూ.500 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.