Steve Waugh: కోహ్లీపై స్లెడ్జింగ్ చేస్తారేమో... అది మీకే బెడిసికొడుతుంది: ఆసీస్ క్రికెటర్లకు స్టీవ్ వా హెచ్చరిక
- నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన
- కోహ్లీని రెచ్చగొడితే టీమిండియాకు లాభిస్తుందన్న వా
- కోహ్లీ వంటి టాప్ ఆటగాళ్లను వదిలేయడమే మేలని సూచన
భారత క్రికెట్ జట్టు మరికొన్నిరోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతోంది. నవంబరు 27న ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘమైన టూర్ వచ్చే ఏడాది జనవరి 15న ముగియనుంది. కాగా, డిసెంబరు 17 నుంచి టెస్టు సిరీస్ షురూ కానుంది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా తమ దేశ క్రికెటర్లకు హెచ్చరిక చేశాడు. టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీతో పొరపాటున కూడా స్లెడ్జింగ్ (మాటలయుద్ధం)కు దిగొద్దని స్పష్టం చేశాడు. కోహ్లీని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే అది ఆస్ట్రేలియా జట్టుకే బెడిసికొడుతుందని అన్నాడు.
రెచ్చగొట్టే మాటలతో కోహ్లీ మరింత పట్టుదలగా ఆడతాడని, టీమిండియా కూడా మరింత సంఘటితం అవుతుందని వివరించాడు. "స్లెడ్జింగ్ తో కోహ్లీని నియంత్రించాలనుకోవద్దు. మాటల యుద్ధం కోహ్లీకి అదనపు ప్రోత్సాహాన్నిస్తుంది. అగ్రశ్రేణి ఆటగాళ్లను మాటలతో రెచ్చగొట్టడం సాధ్యం కాదు. కోహ్లీ వంటి ఆటగాళ్లను వదిలేయడమే మంచిది. కోహ్లీని ఏ మాత్రం కవ్వించినా అది అతని జట్టుకే లాభిస్తుంది" అని ఆసీస్ ఆటగాళ్లకు హితవు పలికాడు.