Chandrasekhar Sharna: జో బైడెన్ తో తన అనుబంధాన్ని వివరించిన కాలిఫోర్నియా హనుమాన్ ఆలయ చైర్మన్
- బైడెన్ ఎంతో మంచి వ్యక్తి అన్న చంద్రశేఖర్ శర్మ
- బైడెన్ కు హిందూ సంప్రదాయాలంటే గౌరవం అని వెల్లడి
- గతంలో తన వీసా సమస్యను పరిష్కరించారని వివరణ
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి సెగలుపొగలు ప్రపంచమంతా వ్యాపించాయి. తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరన్నదే అన్ని దేశాల్లో చర్చనీయాంశంగా ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల తరఫు అభ్యర్థి జో బైడెన్ కే మొగ్గు కనిపిస్తోంది. కాగా, జో బైడెన్ కు హిందూ సంప్రదాయాలంటే ఎంతో గౌరవం అని కాలిఫోర్నియా హనుమాన్ ఆలయం చైర్మన్ చంద్రశేఖర్ శర్మ అంటున్నారు.
చంద్రశేఖర్ శర్మ స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి. తాజాగా జో బైడెన్ పేరు బాగా వినిపిస్తున్న తరుణంలో ఆయనతో తన అనుబంధాన్ని చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు. 2001లో తనకు వీసా రావడంలో ఆలస్యం జరిగిందని, అయితే జో బైడెన్ సహకారంతో ఆ సమస్య నుంచి గట్టెక్కానని వివరించారు. అప్పుడు బైడెన్ డెలావర్ రాష్ట్ర సెనేటర్ గా ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
బైడెన్ హిందువులను ఎంతో గౌరవిస్తారని తెలిపారు 2003లో తాము విల్మింగ్టన్ లో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించగా, బైడెన్ కూడా ఈ క్రతువుకు విచ్చేశారని శర్మ వెల్లడించారు. ఎంతో ఆసక్తిగా హిందూ సంప్రదాయాల గురించి అడిగి తెలుసుకున్నారని, పైగా తిలక ధారణ కూడా చేశారని తెలిపారు.