Vijayashanti: కాంగ్రెస్‌ను వీడబోనని ఫేస్ బుక్ ద్వారా సంకేతాలిచ్చిన విజయశాంతి!
- ఫేస్‌బుక్ కవర్ ఫొటో మార్చిన విజయశాంతి
- అందులో కాంగ్రెస్ పార్టీ చిహ్నం, రాహుల్ గాంధీ ఫొటోలు
- కాంగ్రెస్‌లో కొందరు తనకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని పోస్ట్
- నిన్న వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీకి ధన్యవాదాలు
కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి ఆ పార్టీని వీడతారని, త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఫేస్‌బుక్‌లో పలు పోస్టులు చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ వీడబోనని సంకేతాలు ఇచ్చారు.
‘రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నాయకులు చానెల్స్‌లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీగారికి నా ధన్యవాదాలు’ అని ఆమె అన్నారు. అంతేగాక, తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతాననడానికి సంకేతంగా ఆమె తన ఫేస్‌బుక్ కవర్ ఫొటోను మార్చారు. అందులో కాంగ్రెస్ పార్టీ గుర్తు, రాహుల్ గాంధీ ఫొటోతో పాటు విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఫొటోలు ఉన్నాయి.
కాగా, నిన్న కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ... విజయశాంతి సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాడుకోలేదని తెలిపారు. విజయశాంతి పార్టీ మారరని, సమస్యలుంటే తమ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ పరిష్కరిస్తారని చెప్పారు. బీజేపీలో పరిస్థితి ఎలా ఉంటుందో తమ కంటే విజయశాంతికే ఎక్కువ తెలుసని మధుయాష్కి అన్నారు.