Antibodies: కొందరిలో ముందే యాంటీబాడీలు... కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడి
- పిల్లల్లో అత్యధికంగా ముందే ఉన్న యాంటీబాడీలు
- సాధారణ జలుబుకు గురైనప్పుడు తయారైన యాంటీబాడీలు
- కరోనాపైనా పోరాడుతున్న వైనం
ఏదైనా వైరస్ సోకిన తర్వాత శరీరాల్లో యాంటీబాడీలు తయారవడం సాధారణమైన విషయం. కరోనా వైరస్ విషయంలోనూ అదే జరుగుతోంది. అయితే, కొందరిలో కరోనా సోకకపోయినా, వారి శరీరాల్లో యాంటీబాడీలు ఉన్నట్టు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ యాంటీబాడీలు కరోనా కారక సార్స్ కోవ్-2 వైరస్ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు గుర్తించారు. బ్రిటన్ లోని ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్ స్టిట్యూట్ ఇతర పరిశోధకులతో కలిసి ఓ అధ్యయనం చేపట్టింది.
ముఖ్యంగా చిన్నారుల్లో ఈ తరహా యాంటీబాడీలు ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. గతంలో వారు ఏదైనా జలుబుకు గురైనప్పుడు తయారైన యాంటీబాడీలు వారి శరీరంలోనే ఉండిపోయాయని, ఇప్పుడు కరోనా సోకగానే ఆ యాంటీబాడీలు వెంటనే స్పందించి మహమ్మారి వైరస్ పై పోరాడుతున్నట్టు తెలిసిందని వివరించారు. జలుబుకు కారణమయ్యే కరోనా తరహా వైరస్ లను పోలివున్నందునే ఈ యాంటీబాడీలు కరోనా వైరస్ పై వెంటనే స్పందిస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ అధ్యయనం కోసం అనేక రక్తనమూనాలు సేకరించారు. అందులో కరోనా రోగులతో పాటు, సాధారణ వ్యక్తుల నమూనాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణ వ్యక్తుల నమూనాల్లో యాంటీబాడీలు ఉండడంతో.... 2011 నుంచి 2018 వరకు సేకరించిన కొన్ని రక్తనమూనాలను కూడా పరిశీలించారు. వాటిలోని యాంటీబాడీలతో తాజా యాంటీబాడీలు పోలివున్నట్టు గుర్తించారు.
అలా పరీక్షించిన వారిలో ప్రతి 20 మందిలో ఒకరిలో జలుబు కారక కరోనా తరహా వైరస్ లతో పోరాడిన యాంటీబాడీల ఉనికి వెల్లడైంది. అది కూడా 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో ఈ రకమైన యాంటీబాడీలు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ అధ్యయానికి సంబంధించిన వివరాలు ఓ సైన్స్ జర్నల్ లో ప్రచురించారు.