Jagan: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన సీఎం జగన్
- పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం
- 10 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ
- మరెన్నో విజయాలు సాధించాలన్న ఏపీ సీఎం
శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49 విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడంపై సీఎం జగన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈఓఎస్-01తో పాటు 9 అంతర్జాతీయ వాణిజ్య ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49 విజయం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల ఘనత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు సాధించాలంటూ ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది.
కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో లాక్ డౌన్ విధించాక సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో చేపట్టిన మొదటి రాకెట్ ప్రయోగం ఇదే. వాతావరణం అనుకూలించకపోవడంతో రాకెట్ ప్రయోగం 10 నిమిషాలు ఆలస్యమైనా, మిషన్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఆయన తమ శాస్త్రవేత్తలను అభినందించారు.