KCR: రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గింది: కేసీఆర్
- కేంద్రం ఒక్క పైసా వరద సాయం కూడా చేయలేదు
- కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం రూ. 33,904 కోట్ల మేర తగ్గనుంది
- కేంద్ర నిధుల్లో కూడా కోత పడే అవకాశం ఉంది
భారీ, వర్షాలు వరదల వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారీ నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వరద సాయంగా రాలేదని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోందని అన్నారు. కేంద్రానికి మాటలే తప్ప చేతలు ఉండవని విమర్శించారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నష్టపోతే కేంద్రం స్పందించకపోవడం దారుణమని అన్నారు.
కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని కేసీఆర్ చెప్పారు. 2020-21 లో రూ. 67,608 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలతో బడ్జెట్ తయారు చేశామని... అయితే ఈ ఏడాది కేవలం రూ. 33,704 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశం ఉందని అన్నారు. ఆదాయం రూ. 33,904 కోట్ల మేర తగ్గనుందని చెప్పారు.
ఇక రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చే వాటా భారీగా తగ్గిందని అన్నారు. కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 8,363 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ. 6,339 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కూడా రూ. 802 కోట్ల మేర కోత పడే అవకాశం ఉందని దుయ్యబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ అంచనాల్లో మార్పులు అనివార్యమని ఆర్థికశాఖ స్పష్టం చేసిందని చెప్పారు.