Delhi Capitals: ఢిల్లీయా? హైదరాబాదా? నేడు తేలిపోతుంది!
- ఐపీఎల్ లో నేడు క్వాలిఫయర్-2
- ఢిల్లీతో తలపడనున్న హైదరాబాద్
- ఇప్పటికే ఫైనల్ చేరిన ముంబై జట్టు
ఈ సీజన్ ఐపీఎల్ విజేత ఎవరో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. ఇప్పటికే ఫైనల్స్ కు చేరిన ముంబై ఇండియన్స్ తో ఎవరు పోటీ పడతారన్న విషయం నేటితో తేలిపోతుంది. క్వాలిఫయర్ వన్ మ్యాచ్ లో ఓటమి పాలైన ఢిల్లీ కాపిటల్స్, ఎలిమినేటర్ వన్ లో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నేడు అబుదాబి వేదికగా జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో తలపడనున్నాయి. నేడు విజయం సాధించే జట్టు, ఫైనల్స్ కు చేరి, మంగళవారం జరిగే తుది పోరులో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు చాంపియన్ గా నిలిచిందన్న సంగతి తెలిసిందే. ఫైనల్స్ లో ఆ జట్టుతో తలపడాలంటే, హైదరాబాద్ జట్టు తన ముందున్న తొలి అడ్డంకి డీసీని ఓడించాల్సి వుంటుంది. ఇంతవరకూ ఒక్కసారి కూడా ఫైనల్స్ కు చేరని ఢిల్లీ జట్టు, ఈ సీజన్ లో అనూహ్య విజయాలను సాధిస్తూ టాప్-2గా నిలిచింది. హైదరాబాద్ జట్టు పడుతూ, లేస్తూ సాగి, తన చివరి లీగ్ మ్యాచ్ లో బలమైన ముంబై జట్టుపై విజయం సాధించడం ద్వారా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.
ఇక ఢిల్లీ, హైదరాబాద్ జట్ల ఫామ్ ను పరిశీలిస్తే, వార్నర్ సేనకే అవకాశాలు అధికమనడంలో సందేహం లేదు. తొలి 9 మ్యాచ్ లలో కేవలం 3 విజయాలు మాత్రమే సాధించిన హైదరాబాద్ జట్టు, ఆపై పుంజుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. సన్ రైజర్స్ జట్టుకు బౌలింగ్ ప్రధాన అస్త్రమైతే, డీసీకి బ్యాటింగ్ అస్త్రంగా ఉంది. గడచిన ఆరు మ్యాచ్ లలో హైదరాబాద్ తో ఆడిన జట్లలో కేవలం ఒక్కసారి మాత్రమే 150కి పైగా పరుగులు సాధించారంటే, ఆ జట్టు బౌలింగ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక డీసీని పరిశీలిస్తే, తొలి 9 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లు గెలిచి, ఆపై వరుసగా నాలుగు సార్లు ఓడిపోయిన ఆ జట్టు, పడుతూ, లేస్తూ ప్లే ఆఫ్స్ కు చేరింది. రెండు సెంచరీలు చేసిన డీసీ స్టార్ ప్లేయర్ ధావన్ నాలుగు సార్లు డక్కౌట్ కావడం ఆ జట్టును కలవర పెడుతోంది. ఇక, పృధ్వీ షా 3 సార్లు, రహానే 2 సార్లు సున్నా పరుగులకే పెవీలియన్ చేరారు. అయితే, కేవలం మూడు గంటల వ్యవధిలో ఏ జట్టు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తారో, వారిదే విజయమయ్యే టీ-20లో నేటి మ్యాచ్ లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమే.