Joe Biden: అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా గెలిచిన బైడెన్, కమలా హారిస్ తొలి ప్రసంగాలు!
- అమెరికాను ఐక్యంగా ఉంచుతానన్న బైడెన్
- ప్రజల ఆకాంక్షలు నెరవేరాయన్న కమల
- ఇటీవల మరణించిన నల్లజాతి మహిళకు నివాళులు
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రజలను ఉద్దేశించి, తొలిసారిగా మాట్లాడారు. అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికై, త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్, తాను అమెరికాను విడగొట్టే అధ్యక్షుడిగా ఉండబోనని, ఐకమత్యంగా ఉంచే అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్తాయని తాను నమ్ముతున్నట్టు తెలిపారు.
కమలా హారిస్ మాట్లాడుతూ, "నేటి రాత్రి ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. వారు కోరుకున్న నేత అధ్యక్షుడు అయ్యారు. ఆయన నేతృత్వంలో అమెరికాను మరింత అభివృద్ధి పథంలో నిలిపేందుకు నా వంతుగా కృషి చేస్తా" అన్నారు. తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ మాట్లాడిన ఆమె, ఇటీవల నిరసనల్లో మరణించిన నల్లజాతి మహిళకు నివాళులు అర్పించారు. అమెరికాలో జాత్యహంకారానికి తావులేదని, వర్ణాల కారణంగా ప్రజలు ఇకపై విడగొట్టబడబోరని ఆమె అన్నారు.
వైట్ హౌస్ లో కాలుపెట్టే తొలి ఉపాధ్యక్షురాలిని తాను కావచ్చేమోగానీ, తానే చివరి మహిళను మాత్రం కాదని, మరెంతో మంది అమెరికన్ మహిళలు తమ సమర్ధతను చాటేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అధికారికంగా ఇంకా వెల్లడి కానప్పటికీ, బైడెన్ విజయం సాధించారని అనధికారిక లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకునేందుకు అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లకు పైగానే బైడెన్ సాధించేశారు.