UAE: యూఏఈలో భారీ సంస్కరణలు.. సహజీవనానికి గ్రీన్ సిగ్నల్
- కఠిన చట్టాలను సడలిస్తూ పోతున్న యూఏఈ
- మద్యం విక్రయాలపై ఉన్న ఆంక్షల ఎత్తివేత
- పరువు హత్యలకు ఇకపై ఇతర నేరాలతో సమానంగా శిక్షలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారీ సంస్కరణల దిశగా పయనిస్తోంది. పశ్చిమ దేశాల పర్యాటకులు, ఉద్యోగం, వ్యాపారం కోసం దేశానికి వచ్చే వారిని ఆకర్షించే దిశగా సంస్కరణల్లో భాగంగా ఇప్పటి అమల్లో ఉన్న కఠిన చట్టాలను సవరించింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న కఠిన చట్టాలను నెమ్మదినెమ్మదిగా సడలిస్తూ పోతోంది.
తాజా సంస్కరణల్లో భాగంగా పెళ్లి చేసుకోకుండా యువతీ యువకులు సహజీవనం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మద్యం విక్రయాలపై ఉన్న ఆంక్షలను కూడా సడలించింది. ఇకపై 21 ఏళ్లు, ఆపై వయసు వారికి మద్యం విక్రయించడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధించడం, మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం వంటివి ఉండవు. తాజా నిబంధన ప్రకారం లైసెన్స్ లేకున్నప్పటికీ మద్యం తాగడం తప్పు కాదు. అలాగే, పరువు హత్యలను నేరంగా పరిగణించనున్నారు. ఇతర నేరాలతో సమానంగా వీటికి కూడా శిక్షలు ఉంటాయి. పెళ్లి కాకుండా సహజీవనం చేసే వారికి ఎటువంటి శిక్షలు ఉండవు.