nagaraju: మరో కలకలం.. కీసర మాజీ తహసీల్దార్ కేసులో మరొకరు ఆత్మహత్య
- కొన్ని రోజుల క్రితం మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
- ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ధర్మారెడ్డి
- నాగరాజు ద్వారా నకిలీ పాసు పుస్తకాలు పొందిన ధర్మారెడ్డి
- దాదాపు 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు
కోటి 10 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ధర్మారెడ్డి అనే వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మాజీ తహసీల్దార్ నాగరాజు ద్వారా నకిలీ పాసు పుస్తకాలు పొందడంతో ఆయనను అధికారులు విచారిస్తున్నారు.
దాదాపు 40 ఎకరాలకు నకిలీ పాసు పుస్తకాలు తీసుకున్నట్లు ధర్మారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కుషాయిగూడ వాసవీ శివనగర్ కాలనీలో చెట్టుకు ఉరేసుకుని ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, బెయిల్ పై ఆయన విడుదలయ్యాడు. కాగా, ఇదే కేసులో సెప్టెంబరు 29న ధర్మారెడ్డితో పాటు ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికీ జైలులోనే ఉన్నాడు.