Twitter: డొనాల్డ్ ట్రంప్ కు మరో షాకిచ్చిన ట్విట్టర్!
- ట్రంప్ పోస్టులకు మినహాయింపులు లేవు
- ఆయన ఖాతా కూడా సాధారణమే
- వెల్లడించిన ట్విట్టర్
యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన డొనాల్డ్ ట్రంప్ కు, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మరో షాకిచ్చింది. ఇకపై ట్రంప్ పోస్టులకు ఎటువంటి మినహాయింపులూ ఉండబోవని, సాధారణ పౌరుల ఖాతా వంటిదే ఆయన ఖాతా అని పేర్కొంది. ఇప్పటివరకూ ట్రంప్ చేసే ట్వీట్లను ప్రత్యేకంగా పరిగణిస్తూ, హెచ్చరికలు, లేబుళ్లు జోడిస్తూ, 'పబ్లిక్ ఇంట్రస్ట్' పేరిట హైడ్ చేస్తూ వస్తున్న ట్విట్టర్, ఇకపై అటువంటివి ఏమీ ఉండబోవని, ట్రంప్ పోస్టులను ప్రత్యేకంగా పరిగణించబోమని తేల్చి చెప్పింది.
కాగా, ఫేస్ బుక్ పాలసీ ప్రకారం, ఎన్నికల్లో పోటీ పడుతున్నవారు, పదవిలో ఉన్నవారు, క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న వారి ట్విట్టర్ ఖాతాలకు ఫ్యాక్ట్ చెక్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ విధానం మాజీలకు వర్తించబోదని, పదవి నుంచి వైదొలగిన ట్రంప్ ట్విట్టర్ ఖాతా, ఇప్పుడు సామాన్య పౌరుడి ఖాతాయేనని ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొనడం గమనార్హం.