Donald Trump: వైట్ హౌస్ తో బైడెన్ సంప్రదింపులు... ఇంకా స్పందించని ట్రంప్ టీమ్!
- అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు 73 రోజులు
- వెబ్ సైట్, హ్యాష్ ట్యాగ్ ను ప్రారంభించిన బైడెన్
- గోల్ఫ్ ఆడుకుంటూ కాలం గడిపిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన ఎలక్టోరల్ ఓట్లను సాధించిన డెమొక్రాట్ల నేత జో బైడెన్, వైట్ హౌస్ లోకి ప్రవేశించేందుకు అడుగులు వేయడం ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకూ ఓటమిని అంగీకరించని ట్రంప్ నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. బైడెన్, శ్వేతసౌధంలోకి వెళ్లేందుకు మరో 73 రోజుల గడువుంది. అయితే, ఇప్పటికే బైడెన్ వైట్ హౌస్ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఇందుకోసం 'బిల్డ్ బ్యాక్ బెటర్ డాట్ కామ్' పేరిట ఓ వెబ్ సైట్ ను, 'ట్రాన్సిషన్ 46' పేరిట ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ ను ఆయన ప్రారంభించారు.
ఇక బైడెన్ గెలుపును అంగీకరించని ట్రంప్, శనివారం నాడు ఎక్కడైతే గోల్ఫ్ ఆడుతూ గడిపారో, ఆదివారం కూడా అక్కడే రోజంతా ఉన్నారు. అమెరికా టీవీ చానెళ్లలో ట్రంప్ ఓడిపోయారన్న వార్తలు వస్తున్నా, ఆయన పట్టించుకోలేదు. బైడెన్ కు మెజారిటీకి కావాల్సినన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని తెలుస్తున్నా, పదవిని వదిలేందుకు ట్రంప్ సుముఖంగా లేరని తెలుస్తోంది.
ఇక ఆదివారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో మరోసారి, మదిలోని అక్కసును వెళ్లగక్కిన ఆయన, తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరవుతారు? అని ప్రశ్నించారు. ఈ వారంలో ఆయన పలు కోర్టుల్లో ఎన్నికల కౌంటింగ్ ను సవాలు చేస్తూ, కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ట్రంప్ తరఫు లాయర్ రూడీ గిలియానీ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ లో పలు అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రూడీ వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ చేసిన వ్యాఖ్యలు సైతం వైరల్ అయ్యాయి. 'ఈ ఫలితం సుస్పష్టం' అని వ్యాఖ్యానించిన ఆయన, ప్రెసిడెంట్ గా ఎన్నికైన బైడెన్, ఆయన డిప్యూటీ కమలా హారిస్ లకు శుభాభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో, అమెరికా ప్రజల్లో ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయన్న నమ్మకాన్ని పెంచాల్సి వుందని వ్యాఖ్యానించడం గమనార్హం. దేశ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరని ఆయన అన్నారు.