Melania Trump: ఓటమిని ఒప్పుకో... ట్రంప్ తో మొరపెట్టుకుంటున్న మెలానియా!
- గౌరవంగా పదవి నుంచి వైదొలగండి
- ట్రంప్ అనుచరులతో మెలానియా
- సీఎన్ఎన్ ప్రత్యేక వార్తా కథనం
అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్, ఇప్పుడు తన భర్త, ఓటమిని అంగీకరించి, గౌరవంగా పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేని తన భర్త మనసును మార్చాలని ఆమె ప్రయత్నిస్తున్నట్టు సీఎన్ఎన్ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన అనుచరులతో మెలానియా మాట్లాడారని, ఈ మేరకు ట్రంప్ కు నచ్చజెప్పి ఓటమిని అంగీకరించేలా చూడాలని కోరుతున్నారని మెలానియా సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు వార్తా సంస్థ పేర్కొంది.
అయితే, తన భర్త ఓటమిపై మెలానియా ఇంతవరకూ స్పందించలేదు. ఆమె విడాకులు కోరుకుంటున్నారని, ట్రంప్ వైట్ హౌస్ నుంచి బయటకు రాగానే ఆయన్నుండి విడిపోతారని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ ఓటమిని అంగీకరిస్తున్న ఆమె, తన భర్త కూడా వాస్తవాన్ని హుందాగా అంగీకరించాలని కోరుతున్నారని సీఎన్ఎన్ పేర్కొంది.
కాగా, ఎన్నికలకు ముందు తన భర్త విజయం కోసం మెలానియా సైతం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కుమారుడు, అల్లుడు తదితరులతో కలిసి ఆమె విస్తృత పర్యటనలు కూడా జరిపారు. ఎన్నికల ఫలితాలు దాదాపుగా స్పష్టమైన తరువాత, తప్పుడు మార్గాల్లో బైడెన్ విజయం సాధించాలని చూస్తున్నారని, అందుకోసం పరుగులు పెడుతున్నారని ట్రంప్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తన విజయాన్ని దొంగిలించాలని బైడెన్ చూస్తున్నారని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.