Sanchaita: 'సేవ్ మాన్సాస్' పేరుతో అశోక్ గజపతిరాజు చేస్తున్నది నిజానికి 'సేవ్ అశోక్' క్యాంపైన్: సంచయిత విమర్శలు

Sanchaitha slams Ashok Gajapathiraju

  • అశోక్ గజపతిరాజుపై సంచయిత విమర్శనాస్త్రాలు
  •  ఫక్తు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  •  ముందు మీ అస్తిత్వాన్ని కాపాడుకోండి అంటూ హితవు

మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై ధ్వజమెత్తారు. అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో మాన్సాస్ కార్యకలాపాలు నడిచినప్పుడు అనేక అక్రమాలు జరిగాయని, ఇప్పుడు ఒక్కొక్క అక్రమం బయటపడుతుండడంతో ఆయన రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్నారని, ఏంచేయాలో తెలియక ఫక్తు రాజకీయం చేస్తున్నారని సంచయిత విమర్శించారు. సేవ్ మాన్సాస్ పేరుతో అశోక్ గజపతి చేస్తున్నది నిజానికి సేవ్ అశోక్ క్యాంపైన్ అని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు.

"అశోక్ గారూ... 150 ఏళ్ల చారిత్రాత్మక మోతీ మహల్ ను నేలమట్టం చేసినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం చేపట్టాల్సింది. 8 వేల ఎకరాల మాన్సాస్ భూములను ఎకరా 500 చొప్పున అనుయాయులకు లీజుకు కట్టబెట్టినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం చేయాల్సింది. మార్కెట్ ధరలకు, మీరిచ్చిన లీజులకు ఏమైనా సంబంధం ఉందా? కనీసం ఓ లాయర్ ను ఏర్పాటు చేసుకోవడం కూడా మీకు చేతకాక రూ.13 కోట్ల నష్టాన్ని కలిగించే మాన్సాస్ భూములు ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా అన్యాక్రాంతమైనప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం ప్రారంభించాల్సింది.

2016-2020 మధ్య కాలంలో మీరు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల మాన్సాస్ ట్రస్టు విద్యాసంస్థలకు రూ.6 కోట్ల మేర నష్టం వచ్చింది...  సేవ్ మాన్సాస్ ఉద్యమం అప్పుడు చేయాల్సింది! మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఏపీ ఉన్నత విద్యామండలి నుంచి అవసరమైన అనుమతులు తెచ్చుకోకపోవడంతో 170 మందికి ఇచ్చిన డిగ్రీలు చెల్లకుండా పోయాయి. సేవ్ మాన్సాస్ ఉద్యమం అప్పుడు చేయాల్సింది.

ట్రస్టు కార్యకలాపాలపై సరిగ్గా ఆడిటింగ్ నిర్వహించక, మాన్యువల్ గా ఆడిటింగ్ చేయించినప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం చేసుంటే అసలు రంగు బయటపడేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాన్సాస్ కు రావాల్సిన రూ.30 కోట్ల నిధులను రాబట్టుకోలేకపోయారు. అప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమం చేసుంటే కొంతైనా ప్రయోజనం దక్కి ఉండేది.

అశోక్ గారూ, మీరు ఎంఆర్ కాలేజీపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడే ఇది ఒక ప్రైవేట్ కాలేజ్. ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని మీరే తీసేశారు. ఆ విధానమే ఇప్పుడు కొనసాగుతోంది. నేను ఇప్పుడు సేవ్ మాన్సాస్ ఉద్యమాన్ని నడుపుతున్నాను.. పురాతన వైభవాన్ని పునరుద్ధరిస్తాను. మీరు మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోండి" అంటూ అశోక్ గజపతిరాజుపై సంచయిత ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News