Pilots: నకిలీ పత్రాలతో లైసెన్సులు పొందిన పాక్ పైలెట్లు... నిషేధం విధించనున్న ప్రపంచ దేశాలు!

Chances of ban on Pak pilots
  • పీఐఏ విమానాలపై 188 దేశాలు నిషేధం విధించే అవకాశం
  • పాక్ పైలట్ల తీరుపై ఐసీఏఓ ఆగ్రహం
  • నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న పైలట్ల సంఘం
పాకిస్థాన్ లో 262 మంది పైలెట్లు నకిలీ పత్రాలు సమర్పించి లైసెన్సులు పొందినట్టు ఆగస్టులో ఆ దేశ విమానయాన మంత్రి వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగడం తెలిసిందే. వారిలో 146 మంది పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందినవారే. దీనిపై అంతర్జాతీయ పౌర వియానయాన సంస్థ (ఐసీఏఓ) దృష్టి సారించడమే కాకుండా, నకిలీ పత్రాలతో లైసెన్సులు పొందిన పైలట్లతో విమానాలు నడపడం పట్ల పాక్ ను తీవ్రంగా హెచ్చరించింది. అంతర్జాతీయ శిక్షణ ప్రమాణాలను పాటించడంలో పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (పీసీఏఏ) విఫలమైందని స్పష్టం చేసింది.

ఐసీఏఓ హెచ్చరికల నేపథ్యంలో 188 దేశాలు పాక్ విమానాలను నిషేధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ దేశాలు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానాలపై నిషేధం విధించాయి. పీఐఏ విమానాలపైనే కాకుండా, పాక్ పైలెట్లు నడిపే ఏ విమానం తమ గగనతలంలో ఎగరకుండా నిషేధించేందుకు ఆయా దేశాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

దీనిపై పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ పైలెట్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమపై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెబుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పైలెట్ల సంఘం కోరుతోంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది.
Pilots
Ban
PIA
Licenses
Pakistan

More Telugu News